వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!!

ఢిల్లీలో ఏడేళ్ల క్రితం నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె చావుకి కారణమైన దుర్మార్గులు దోషులని తేలిన తర్వాత కూడా ఇంకా వారికి వెంటనే ఉరిశిక్ష విధించకుండా కాలయాపన చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

Pavan Reddy Naini Pavan | Updated: Dec 1, 2019, 06:21 PM IST
వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!!

హైదరాబాద్: ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగి ఏడేళ్లయినా.. ఆమె చావుకి కారణమైన దుర్మార్గులు దోషులని తేలిన తర్వాత కూడా ఇంకా వారికి వెంటనే ఉరిశిక్ష విధించకుండా కాలయాపన చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఇదే విషయాన్ని ఆయన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తూ.. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలిన వారికి వెంటనే ఉరిశిక్ష విధించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో ప్రధాని మోదీని ట్యాగ్ చేసిన కేటీఆర్.. ఇటీవల ఓ 9 నెలల చిన్నారిపై లైంగిక దాడి కేసులోనూ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించగా.. హైకోర్టు దాన్ని జీవితఖైదుగా మార్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఓ వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యకు గురైంది. నిందితులు దొరికారు. ఒకవేళ బాధితులకు న్యాయం చేయడంలో ఆలస్యమైందంటే.. వారికి ఇక న్యాయం జరగనట్టేని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ సమావేశాల్లోనే దీని మీద ఒక రోజు మొత్తం చర్చించైనా ఐపీసీ, సీఆర్పీసీలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తోన్న కోట్లాది మంది నెటిజెన్స్ తరపున తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి తెలిపారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడేవారికి మానవమృగాలకు మరణశిక్షే సరైందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దోషులు కోర్టు తీర్పు మీద పై కోర్టులకు రివ్యూకి వెళ్లే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇకనైనా చట్టాలు మార్చాల్సిన సమయం వచ్చింది’ అని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మన నుంచి ప్రజలు కోరుకుంటోంది కూడా అదేనని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు.

మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి చేసిన ట్వీట్‌పై సైతం భారీ ఎత్తున మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నిర్భయపై అత్యాచారం, దారుణ హత్య కేసులో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీకి చేసిన ఈ ట్వీట్‌కి భారీ స్పందన కనిపిస్తోంది. నెటిజెన్స్ సైతం ఆయన ట్వీట్‌‌ను రిట్వీట్ చేస్తూ, లైక్ కొడుతూ మంత్రి మాటలకు తమ మద్దతు తెలియజేస్తున్నారు.