యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ లకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో 100 యానిమేషన్ సంస్థలు, 2డి, 3డి సూడియోలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 30 వేలమంది ఉపాధి పొందుతున్నారన్నారు. గేమింగ్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని.. ఇటీవలే ఇమేజ్ టవర్ కు పునాదిరాయి వేశామని గుర్తుచేశారు.
హైదరాబాద్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న గేమర్ కనెక్ట్ 2017ను మంత్రి కేటీఆర్ శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఇమేజ్ టవర్ లో మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఆవిష్కరణలు, అన్వేషణలు జరుగుతాయన్నారు. ఎన్విడియా, డెల్, ఎల్జీ తదితర బహుళ జాతి సంస్థలు ఇందులో పాల్గొంటాయని చెప్పారు. టవర్ లో సంస్థలు ఏర్పాటుచేసుకుని పూర్తిస్థాయిలో పనులు ప్రారంభిస్తే వేలాది మందికి ఉపాధిఅవకాశాలు దొరుకుతాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ 4కే గేమ్ ఆడారు. కాగా ఈ షోలో 24 గేమింగ్ కంపెనీలు పాల్గొన్నాయి. స్కూల్ విద్యార్థులు సందడి చేశారు. ఈ ఈవెంట్ లో ఐదు నగరాల నుండి 15 వేలమంది పాల్గొంటారు.
గేమింగ్ కు మంచి భవిష్యత్తు: కేటీఆర్