హైదరాబాద్: మహాకూటమికి మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అంతమొందించి.. సీఎం కేసీఆర్ ను గద్దె దించే లక్ష్యంలో కలిసి పోటీ చేయాలనే కాంగ్రెస్ ప్రతిపాదనకు టి.టీడీపీ, టీజేఎస్, సీపీఐ తదితర పార్టీలు అంగీకరించాయి. ఈ కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కు పొత్తులకు సంబంధించిన ప్రతిపాదనలను టి.టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు అందజేశాయి. సర్వే ఆధారంగా పార్టీ బలబలాలు నిర్ణయించాలని తీర్మానించాయి. కూటమిలోని ఆయా పార్టీ బలాబలాలను తేల్చిన అనంతరం సీట్ల కేటాయింపు, సర్దుబాబు ఉండనుంది. పార్టీల స్థితిగతులను సర్వే చేసే బాధ్యత కాంగ్రెస్ కు అప్పగించారు.
ఏ ఏ స్థానంలో ఏ పార్టీకి ఎంత బలంగా ఉంది.. అభ్యర్ధి బలాబలాలు ఎలా ఉన్నాయి.. అనేది తేలిన తర్వాతే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనే నిర్ణయం జరుగుతుంది. సర్వే ఫలితాలు అందిన తర్వాత రెండో దశ చర్చలు నిర్వహిస్తారు. రెండో దఫా చర్చల్లో సీట్ల సర్దుబాటు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయం తేలనుంది. కాగా మూడో దశ చర్చల్లో ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. కాగా ఈ భేటీలో కాంగ్రెస్ తరుఫున టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క హాజరుకాగా టీడీపీ నుంచి ఎల్ రమణ , సీపీఐ నుంచి చాడా వెంకట్ రెడ్డి , టీజేఎస్ నుంచి ఒక ప్రతినిధి భేటీకి హాజరయ్యారు.