మహాకూటమి పరిణామాలతో టీఆర్ఎస్ ఖుష్ ; జాప్యమే కలిసి వస్తుందని ధీమా

మహాకూటమి పరిణామాలు టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ గా మారుతున్నాయా ?  సీట్ల సర్దుబాటు జాప్యం ఆ పార్టీకి లబ్ది కలుగుతుందా ?  కాంగ్రెస్ అభ్యర్థుల జాప్యం వల్ల టీఆర్ఎస్ కు లాభపడుతుందా ? ఈ ప్రశ్నలకు ఓననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు

Last Updated : Nov 13, 2018, 05:26 PM IST
మహాకూటమి పరిణామాలతో టీఆర్ఎస్ ఖుష్ ; జాప్యమే కలిసి వస్తుందని ధీమా

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దాదాపు రెండు నెలల క్రితమే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతోపాటు నామినేషన్ల దాఖలులోనూ గులాబీ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీఐపి ఆధ్వర్యంలో ఏర్పాటైన మహాకూటమి ఇంకా ఎవరికి ఎన్ని సీట్లు, అభ్యర్థుల ఎంపిక విషయాలపైనే చర్చించుకుంటోంది. కూటమిలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ సీట్లపై దాదాపు ఒక అవగాహనకు వచ్చినప్పటికీ కోదండరామ్ పార్టీ, సీపీఐ మాత్రం ఇంకా తాము కోరినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ పరిణామాలతో మహాకూటమీలో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అభ్యర్ధులను ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది.

జాప్యంతో శ్రేణుల్లో తీవ్ర నైరాష్యం

మహాకూటమి అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతున్నకొద్దీ ఆపార్టీల్లో అసంతృప్తుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర రోజూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టీలోని కిందిస్థాయి శ్రేణుల్లో తీవ్ర నైరాష్యం నెలకొనే అవకాశం ఉంది. దీనితోడు సీట్ల పంపకాల్లో కొందరు సీనియర్ నాయకులకు కూడా టిక్కెట్లు దక్కకపోవచ్చన్న ప్రచారం కూడా మహాకూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే మహాకూటమిని చంద్రబాబు నడిపిస్తున్నారని, కాంగ్రెస్ చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటోందని గులాబీ నేతలు ఎదురుదాడి చేస్తుండడం.. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ దూతగా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అమరావతిలో చంద్రబాబును కలవడం లాంటి పరిణామాలు హస్తం నేతలను నివ్వరపోయేలా చేస్తున్నాయి. ఇదే మహాకూటమికి పెద్ద మైనస్ పాయింట్ అవుతోంది.

 రెట్టించిన ఉత్సాహాంలో టీఆర్ఎస్..

అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యమైతే రెబల్స్ సంఖ్య పెరగడంతోపాటు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమన్న భావనలో కార్యకర్తలు వెళ్లే ప్రమాదం ఉంది. మొత్తం మీద కేసీఆర్ ఓటమి కోసం అన్ని పక్షాలను ఏకం చేసుకుని ఎన్నికల రణక్షేత్రంలోకి దూకాలన్న మహాకూటమి నేతలు ఇంకా ఎటూ తేల్చుకోలేకపోవడం గులాబీ దళంలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది. ఏదేమైనా సీట్ల పంపకాల్లోనే ఇంత ప్రతిష్టంభన కొనసాగితే ఇక భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భావన ప్రజల్లో కలుగుతోంది. 

Trending News