ఆ పాముకు అతీత శక్తులేమీ ఉండవు: అటవీశాఖ

ఆ పాముకు అతీత శక్తులున్నాయనడంలో ఎటువంటి నిజం లేదని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ తెలిపింది.

Last Updated : Feb 18, 2018, 04:37 PM IST
ఆ పాముకు అతీత శక్తులేమీ ఉండవు: అటవీశాఖ

హైదరాబాద్: రెండు తలలు కలిగిఉన్న పాముకు ఎటువంటి అతీత శక్తులు ఉండవని, ఎవరైనా అలా ఉన్నాయని ప్రచారం చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ వెల్లడించింది. రెండు తలల పామును అమ్మితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పాములను అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరమని, అందుకు మూడేళ్ల దాకా జైలుశిక్ష పడే అవకాశముందని అటవీశాఖ తెలిపింది.

రెండు తలల పాముకు తల ఒకటే ఉంటుందని, దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని, గుప్త నిధులను గుర్తిస్తుందన్న ప్రచారంలో నిజంలేదని పేర్కొంది. రెండు తలల పామును అమ్మినా, వాటికి అతీత శక్తులున్నాయని ఎవరైనా ప్రచారం చేసినా తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ ప్రత్యేకాధికారి ఎ.శంకరన్‌ చెప్పారు. అటవీశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

Trending News