Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ: రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires on PM Modi And CM KCR: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిందన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2023, 04:20 PM IST
Revanth Reddy: మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ: రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires on PM Modi And CM KCR: బీఆర్‌ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని తమ నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ ఆదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు.. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్‌కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ.. 

అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇస్తారు..? ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది.. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్‌ఎస్‌తోనా..? బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటున్న కాంగ్రెస్‌తోనా..?
కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవితకు కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు.. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే.. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి..?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోదీ అని స్పష్టత వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే తనకు చెప్పారని అన్నారు. 9 బీఆర్‌ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారని పేర్కొన్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారని అన్నారు.

మంత్రి హరీష్ రావుకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజల దృష్టిని మరల్చడానికే తనపై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు జైలుకెళ్లే టైమ్‌ వచ్చిందనే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్‌కు పదేళ్లు తాను చేసిన అభివృద్ధి.. ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని సవాల్ విసిరారు. కోస్గి, కొడంగల్, మద్దూరులో ఆసుపత్రులు తీసుకొచ్చా.. వాటిని వాళ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బస్ డిపో కోసం 5 ఎకరాలు తాము కొని ఇచ్చామన్నారు. బిల్లా రంగాలు ఇద్దరూ కొడంగల్ రావాలని.. కొడంగల్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు. 

Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News