Munugode Byelection: రండి బాబు రండి పార్టీలో చేరితే 10 లక్షలు.. మునుగోడు లీడర్లకు బంపర్ ఆఫర్

Munugode Byelection:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్న పార్టీల నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉప ఎన్నికతో స్థానిక సంస్థల ప్రతినిధులకు పంట పండుతోందని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 11:24 AM IST
  • మునుగోడులో జోరుగా ఆపరేషన్ ఆకర్ష్
  • కారెక్కుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు
  • కాంగ్రెస్ నేతలకు భారీగా తాయిలాలు
Munugode Byelection: రండి బాబు రండి పార్టీలో చేరితే 10 లక్షలు.. మునుగోడు లీడర్లకు బంపర్ ఆఫర్

Munugode Byelection:  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్ ను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. అందుకే ప్రధాన పార్టీలన్ని ఫోకస్ చేయడంతో తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. గెలుపు కోసం పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్న పార్టీల నేతలు.. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఉప ఎన్నికతో స్థానిక సంస్థల ప్రతినిధులకు పంట పండుతోందని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష్  కు తెరతీసిన పార్టీలు.. గ్రామస్థాయిలో బలమున్న నేతలను తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం భారీగా తాయిలాలు ఇస్తున్నారని తెలుస్తోంది. నాయకుడి స్థాయిని బట్టి రేట్ ఫిక్స్ చేశారని అంటున్నారు. సర్పంచ్ కు     ఒక రేట్, ఎంటీపీసీ అయితే ఇంకో రేట్.. ఎంపీపీ, జడ్పీటీసీ అయితే మరింత ఎక్కువ రేట్ పలుకుతుందట. స్థానిక సంస్థల ప్రతినిధులే కాదు గ్రామ స్థాయి, మండల స్థాయి లీడర్లకు భారీగానే ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమితో షాకైన అధికార పార్టీ మునుగోడులో ఎలాగైనా గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీను ఇంచార్జ్ లు గా నియమించింది. మంత్రి జగదీశ్ రెడ్డి డైరెక్షన్ లోనే నియోజకవర్గంలో పర్యటిస్తున్న అధికార పార్టీ నేతలు.. ఈనెల 20న మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ జనసమీకరణ ఏర్పాట్లూ చూస్తూనే వలసలపై ఫోకస్ చేశారు. ఇతర పార్టీల స్థానిక ప్రతినిధులతో మాట్లాడుతూ కారెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. తనతో పాటు వందలాది మంది అనుచరులను కమలం గూటికి తీసుకువెళ్లాలని కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ లో తనకు మద్దతుగా ఉన్న నేతలను బీజేపీలో చేర్చేలా రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. దీంతో ముందే అప్రమత్తమైన కారు పార్టీ లీడర్లు.. కాంగ్రెస్ నేతలెవరు రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా యాక్షన్ మొదలుపెట్టారు. అమిత్ షా సభలోపే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు జగదీశ్ రెడ్డి.

మునుగోడు నియోజకవర్గంలోనే తిరుగుతున్న జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పేస్తున్నారు. గత మూడురోజుల్లోనే జగదీశ్ రెడ్డి సమక్షంలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు, ఒక సర్పంచ్, ఒక మండల కో అప్షన్ మెంబర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మంత్రితో సంబంధం లేకుండానే కాంగ్రెస్ నేతలను గులాబీ గూటికి చేర్చుతున్నారు. మునుగోడు మండలానికి చెందిన ఐదుగురు సర్పంచ్ లు, ఇద్దరు ఎంపీటీసీలకు తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పించారు. కేసీఆర్ మునుగోడు సభలోపు మరికొంత మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేతల నివాసాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నేరుగా వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరగానే నజరానా ముట్టచెప్పేలా డీల్స్ జరుగుతున్నాయని అంటున్నారు. టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ టీఆర్ఎస్ లో చేరితే 10 లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరగానే ఐదు లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారని.. ఎన్నికల సమయంలో మిగితా అమౌంట్ ఇచ్చేలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఎంపీపీ, జడ్పీటీసీలు అయితే భారీగానే ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామాల్లో పట్టున్న నేతలకు కూడా ఇలాంటి ఆఫర్లే అధికార పార్టీ నుంచి వస్తున్నాయని అంటున్నారు. తాయిలాలకు లొంగకపోతే  చెక్ పవర్ రద్దు చేయిస్తామని సర్పంచ్ లను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

అటు మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం. టీఆర్ఎస్ ఇస్తున్న తాయిలాలకు ధీటుగా కాంగ్రెస్ నేతలకు కమలం నేతలు ఆఫర్ చేస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఎత్తులతో ఇదే అదనగా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ స్థానిక ప్రతినిధులు, ముఖ్య నేతలు ఎవరి దారి వారు చూసుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ వస్తుందని చెబుతున్న బడా బిల్డర్ చల్లమల్ల కృష్ణారెడ్డి.. తాను కూడా ఆర్థికంగా సాయం చేస్తానని కాంగ్రెస్ నేతలకు చెబుతున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో వాళ్లు ఉండలేకపోతున్నారని అంటున్నారు. అంతేకాదు సర్పంచ్ లకు సంబంధించిన లక్షల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నాయి. తమ పార్టీలో చేరితేనే బిల్లులు క్లియర్ చేస్తామని గులాబీ లీడర్లు స్ఫష్టం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీలో చేరాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అటు ఇతర పార్టీల నేతలకు వల వేయడంతో పాటు సొంత పార్టీ ప్రతినిధులకు తాయిలాలు ఇస్తున్నారని సమాచారం. మొత్తంగా ఉప ఎన్నికతో మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పంట పండుతుందని జనాలు చర్చించుకుంటున్నారు.

Read Also: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విషాదం... ప్రసంగిస్తూనే కుప్పకూలిన వ్యక్తి... గుండెపోటుతో హఠాన్మరణం

Read Also: Munugode Byelection: మునుగోడు నియోజకవర్గంలో కలకలం.. చౌటుప్పల్ ఎంపీపీ అరెస్ట్! బీజేపీలో చేరుతారనేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News