China Plane Crash: చైనాలో కుప్పకూలిన మరో విమానం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు...

China Plane Crash: చైనాలో మరో విమానం కుప్పకూలింది. విమానం ఇళ్లపై కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 01:26 PM IST
  • చైనాలో మరో విమాన ప్రమాద ఘటన
  • హుబెయ్ ప్రావిన్స్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం
  • ఒకరు మృతి... ఇద్దరికి గాయాలు...
 China Plane Crash: చైనాలో కుప్పకూలిన మరో విమానం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు...

China Plane Crash : చైనాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హుబెయ్ ప్రావిన్స్‌లోని లాహోకౌ విమానాశ్రయానికి సమీపంలో సైనిక శిక్షణ విమానం ఎయిర్‌ఫోర్స్ జే-7 కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పైలట్ ప్యారాచూట్ సాయంతో కిందకు దూకేయగా అతను గాయాలపాలయ్యాడు. విమానం ఇళ్లపై కూలడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తితో పాటు గాయపడిన ఇద్దరు సాధారణ పౌరులేనని సమాచారం.

ప్రమాదం కారణంగా ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఘటనా స్థలంలో స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

తాజా ఘటనతో ఈ ఏడాది చైనాలో ఇప్పటివరకూ చోటు చేసుకున్న విమాన ప్రమాదాల సంఖ్య మూడుకి చేరింది. ఈ ఏడాది మార్చి 12న కున్మింగ్ నుంచి గ్వాంగ్‌జౌకు వెళ్తున్న బోయింగ్ 737 విమానం టెంగ్జియన్ కౌంటీలో కుప్పకూలిన ఘటనలో 132 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే చాంగ్‌కింగ్ నగరంలో మరో విమానం కుప్పకూలగా దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. చైనాలో వరుస విమాన ప్రమాద ఘటనలు అక్కడి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
 

Trending News