11 రోజుల ఆసియా పర్యటన యాత్రకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయల్దేరారు. ఆసియా యాత్రలో భాగంగా ఆయన జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, పిలిప్పీన్స్ దేశాల్లో పర్యటించనున్నారు. గత 25 ఏళ్లలో ఓ అమెరికా అధ్యక్షుడు ఆసియాలో 10 రోజులకు పైగా పర్యటించడం ఇదే తొలిసారి. 1991-1992 మధ్య కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఆసియా దేశాల్లో సుదీర్ఘంగా పర్యటించారు.
ఒకపక్క అణు పరీక్షలు, అణుబాంబులు అంటూ ఉత్తర కొరియాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఈ సమయంలో.. ఆసియా దేశాల్లో ట్రంప్ పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా విషయంలో చైనాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ట్రంప్ ఉన్నట్లు సమాచారం. ఆదే ఎజెండా గా కూడా కనిపిస్తుంది ఈ పర్యటనలో.
ఆసియా కు బయల్దేరడానికి ముందు ట్రంప్ హవాయికి వెళ్లి, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాడి జరిగిన పెరల్ హార్బర్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి జపాన్ బయల్దేరారు. జపాన్ పర్యటన ముగించుకొని వీరిద్దరూ దక్షిణ కొరియా వెళ్లనున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు దక్షిణాన ఉన్న ఒక యుఎస్ సైనిక సముదాయం అయిన క్యాంప్ హంఫ్రీస్ ను సందర్శిస్తారు. అనంతరం వియత్నం బయలుదేరుతారు.
వియత్నాంలో, అధ్యక్షుడు ట్రంప్ ద నంగ్ లో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు మరియు హనోయి రాష్ట్ర పర్యటన చేస్తారు.
పర్యటనలో భాగంగా చివరి మజిలీ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలోని దక్షిణ-తూర్పు ఆసియా దేశాల సమావేశానికి హాజరవుతారు.