ఇద్దరు రాయిటర్స్ సంస్థ జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది మయన్మార్ కోర్టు. దేశ రహస్యాలను విదేశాలకు చేరవేశారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. గతఏడాది డిసెంబర్‌లో అరెస్టు అయిన వారికి.. నాటి నుండి ఏడేళ్ల శిక్ష అమల్లోకి వచ్చినట్లు కోర్టు తెలిపింది. మయన్మార్ అధికారిక రహస్య చట్టం ప్రకారం.. వీరికి ఈ శిక్ష విధించగా.. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ విచారం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు జైలు శిక్ష విధించడంతో.. స్థానికంగా పెద్దయెత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా జర్నలిస్టులను విడుదల చేయాలని ఐక్య రాజ్య సమితి మయన్మార్ ప్రభుత్వాన్ని కోరింది.
గతేడాది మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన హింసాకాండ గురించి తెలిసిందే. మయన్మార్ నుంచి రోహింగ్యాలను వెళ్లగొట్టేందుకు సైన్యం వారిపై విపరీత చర్యలకు పాల్పడింది. అంతర్జాతీయ మీడియా సంస్థలు దీనిపై అనేక కథనాలు ప్రచురించాయి. కాగా.. ఈ వార్తలను ప్రచురించే క్రమంలో దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్ (32), కియా సో ఓ (28)లపై కేసు వేసి.. గతేడాది డిసెంబరులో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి యాంగాన్ ఇన్‌సీన్ జైలులో కస్టడీలో ఉన్న వీరిని.. తాజాగా కోర్టు చట్టం ఉల్లంఘన కేసులో దోషిగా తేల్చి.. వా లోన్, కియాలకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.