ప్రధాని నరేంద్ర మోదీ ఐదురోజుల విదేశీ పర్యటన నిమిత్తం సోమవారం అర్థరాత్రి (భారత కాలగమనం ప్రకారం) స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ చేరుకున్నారు. ఏప్రిల్ 20 వరకు సాగే ఈ పర్యటనలో స్వీడన్, అనంతరం మోదీ బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నారు. స్వీడన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్‌తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుపుతారు.
Scripting history! PM @narendramodi arrives in Stockholm on a first bilateral visit by an Indian PM in 30 years to a warm and personal welcome by @SwedishPM Stefan Löfven at the airport and to participate in the first ever India-Nordic Summit. pic.twitter.com/leAsRMGKT3
— Raveesh Kumar (@MEAIndia) April 16, 2018
‘భారత్–స్వీడన్ మధ్య హృదయపూర్వక స్నేహ సంబంధాలున్నాయి. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మించబడింది. మా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వీడన్ విలువైన భాగస్వామి’ అని పర్యటనకు ముందు మోదీ పేర్కొన్నారు. తన తాజా విదేశీ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకు మరింత బలాన్ని అందించగలదన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం సహా స్వీడన్, యుకేలతో ద్వైపాక్షికంగా భారత్‌ను మరింత సన్నిహితం చేస్తామని ఆయన వెల్లడించారు.
ప్రధాని స్టెఫాన్‌తో చర్చల తర్వాత ఆ దేశ రాజు కార్ల్ గుస్తాఫ్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. అనంతరం భారత్, స్వీడన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా–నోర్డిక్ (ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల కలిపి) సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
స్వీడన్ పర్యటన అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్(బ్రిటన్) కు మోదీ వెళ్తారు. అక్కడ చోగమ్(కామన్వెల్త్ దేశాల) సదస్సులో పాల్గొనడంతోపాటు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మేతోనూ చర్చలు జరుపుతారు. హెల్త్‌కేర్, డిజిటల్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య సహకారం పెంపొందేలా ఈ పర్యటన సందర్భంగా చర్యలు తీసుకుంటామని మోదీ తెలిపారు.
బ్రిటన్ రాణితో మోదీ భేటీ
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. రెండు దేశాల సీఈవోలతోనూ సమావేశమై సరికొత్త ఆర్థిక భాగస్వామ్య ప్రణాళికను ఆవిష్కరిస్తారు. లండన్‌లో ఆయుర్వేద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభిస్తారు.