సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని నిలిపేసిన పాక్.. రైలును అటారికి చేర్చిన భారత సిబ్బంది

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని నిలిపేసిన పాక్.. రైలును అటారికి చేర్చిన భారత సిబ్బంది

Last Updated : Aug 8, 2019, 11:29 PM IST
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని నిలిపేసిన పాక్.. రైలును అటారికి చేర్చిన భారత సిబ్బంది

పాకిస్తాన్ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్న పాకిస్తాన్ ఇప్పటికే భారత హై కమిషనర్ అజయ్ బిసెరియాను వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా తాజాగా గురువారం నాడు మధ్యాహ్నం భారత్ చేరుకోవాల్సిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ వాఘా వద్దే నిలిపేసింది. పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మెద్ చేసిన ఆదేశాల మేరకు అక్కడి రైల్వే అధికారులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ని వాఘా వద్దే నిలిపేశారు. దీంతో ఈ సమాచారం అందుకున్న భారత రైల్వే శాఖ.. ఓ ఇంజిన్‌తోపాటు డ్రైవర్, రైల్వే, భద్రతా సిబ్బందిని వాఘా పంపించింది. అనంతరం భారత సిబ్బంది సహాయంతో గురువారం సాయంత్రానికి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ అటారికి చేరింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే పాకిస్తాన్ ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

పాకిస్తాన్ నుంచి భారత్ చేరుకున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 110 మంది ప్రయాణికులు ఉన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలకు చిహ్నంగా నిలిచిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ సేవలను పాకిస్తాన్ నిలిపేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నట్టయింది.

Trending News