బంగ్లాదేశ్ ఎన్నికలు : భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించిన షేక్ హసీనా

భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించిన షేక్ హసీనా

Last Updated : Dec 31, 2018, 05:50 PM IST
బంగ్లాదేశ్ ఎన్నికలు : భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించిన షేక్ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగగా ఇవాళ ఆ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటివరకు అధికారంలో వున్న ఆవామీ లీగ్ (ఏఎల్) పార్టీనే ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. మొత్తం 300 స్థానాలు కలిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీక్ నేతృత్వంలోని మహా కూటమి 288 స్థానాలు కైవసం చేసుకుంది. షేక్ హసినా పోటీ చేసిన గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో ఆమెకు 2,29,539 ఓట్లు లభించగా ఆమె ప్రత్యర్థి అయిన బీఎన్పీ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు మాత్రమే పోల్ అయినట్టుగా అక్కడి ఈసీ స్పష్టంచేసింది. భారీ మెజార్టీతో గెలిచి షేక్ హసినా చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ఫ్రంట్‌కు కేవలం 7 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహాకూటమి కైవసం చేసుకున్న 288 స్థానాల్లో షేక్ హసీనా నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసిన అవామీ లీగ్‌ పార్టీనే 259 స్థానాలు గెలుచుకోవడం విశేషం. ఆవామీ లీగ్ భాగస్వామి జాతీయ పార్టీ 20 స్థానాలు గెల్చుకోగా.. వర్కర్స్ పార్టీకి మూడు, జాతీయ సమాజ్ తాంత్రిక్ దళ్ (జేఏఎస్ఏడీ), బికల్పధార, గణ ఫోరమ్ పార్టీలకు రెండేసి స్థానాల్లో విజయం దక్కగా తరికత్ ఫెడరేషన్, జేపీ పార్టీలు చెరో స్థానంతో సరిపెట్టుకున్నాయి. మరో మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 

బ్రాహ్మన్బారియా-2 నియోజకవర్గం ఫలితంపై ఆ దేశ ఎన్నికల సంఘం స్టే విధించింది. గైబంధ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా నాలుగోసారి ఎన్నికైన ప్రధానిగా షేక్ హసీనా చరిత్ర సృష్టించనున్నారు.

Trending News