దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రవేశిచిందా.. ? ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో ఇదే గందరగోళం నెలకొంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు ఢిల్లీ వ్యక్తులకు వైరస్ సోకినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేశ రాజధానిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఐతే ముందస్తుగా ఢిల్లీ వైద్యాఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ముగ్గురు కరోనా వైరస్ అనుమానితులు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పటికీ పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ మీనాక్షి భరద్వాజ్ తెలిపారు. వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. ఆ రిపోర్టులు వస్తే కానీ అసలు నిజానిజాలు తెలియవు. అప్పటి వరకు వారిని ప్రత్యేక వార్డులోనే ఉంచి సాధారణ జలుబు, దగ్గు, జ్వరానికి చికిత్స అందిస్తామని వైద్యులు ప్రకటించారు.
మొత్తానికి చైనా నుంచి క్రమంగా భారత్ లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఢిల్లీ వైద్యులు మాత్రం .. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..