నేటి నుంచి భారత్‌లో పర్యటించనున్న ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా

నేటి నుంచి భారత్‌లో పర్యటించనున్న ఐరాస సెక్రటరీ జనరల్‌

Last Updated : Oct 1, 2018, 10:49 AM IST
నేటి నుంచి భారత్‌లో పర్యటించనున్న ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ సోమవారం భారతదేశానికి రానున్నారు. ఐరాస సెక్రటరీ జనరల్‌ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది.

అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ 150వ జయంతి ప్రారంభోత్సవాల్లో గుటెర్రస్‌ పాల్గొంటారు. ప్రపంచ అహింసా దినోత్సవం (లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం) గా మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాటిస్తారు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న జనరల్ అసెంబ్లీలో అమోదించింది.

పర్యటనలో భాగంగా గుటెరస్.. సోమవారం సాయంత్రం, అక్టోబర్ 1న న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన యూఎన్ కార్యాలయాన్ని ఆవిష్కరిస్తారు.

మరుసటి రోజు మంగళవారం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుధ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ పాల్గొంటారు.

అక్టోబర్ 2న "ప్రపంచ సవాళ్లు, ప్రపంచ పరిష్కారాలు " అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యాక్రమానికి ముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో కూడా సమావేశమవుతారు. సాయంత్రం, సెక్రటరీ జనరల్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ జనరల్ అసెంబ్లీలో పాల్గొంటారు.

బుధవారం అక్టోబరు 3న, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్‌.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ , ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమవుతారు. మధ్యాహ్నం అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు.

గురువారం, అక్టోబరు 4 న గుటెర్రస్ న్యూ యార్క్‌కు తిరిగి బయల్దేరి వెళ్తారు.

ప్రపంచంలో ఉగ్రవాద నిర్మూలనలో భారత్ పాత్ర కీలకమని.. భారత సందర్శనకు వచ్చే ముందు ఆంటోనియా గుటెర్రెస్ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే అభివృద్ధి సాధించలేమన్న ఆయన..  ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై రాజీలేకుండా పోరాడే దేశాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలని.. దీని వల్ల ఉగ్రవాదాన్ని తరిమిగొట్టడం సాధ్యమవుతుందన్నారు.

Trending News