కరోనా వైరస్ దెబ్బకు అమెరికా విలవిల
అగ్రరాజ్యంలో కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థ
పెరుగుతున్న నిరుద్యోగిత శాతం
భారతీయుల ఉద్యోగాలపై ప్రభావం
హెచ్- 1 B వీసాలు నిషేధించే ఆలోచన
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
అమెరికాలో నిరుద్యోగిత శాతం 14.7 శాతానికి చేరుకుందని.. యూఎస్ బ్యుూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తెలిపింది. నిన్న (శుక్రవారం) ఇందుకు సంబంధించిన గణాంకాలు విడుదల చేసింది. మొత్తంగా ఏప్రిల్ నెలలో 14.7 శాతానికి నిరుద్యోగిత రేటు పెరిగిందని వెల్లడించింది. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 30 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. రోజు రోజుకు పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థ కారణంగా నిరుద్యోగిత రేటు పెరుగుతోంది.
ఫలితంగా వలసదారులకు ఉద్యోగాలు ఇవ్వడంపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి హెచ్-1B , హెచ్-2B, స్టూడెంట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించాలన్నది ట్రంప్ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది.
హెచ్-1B సహా ఇతర వీసాలపై తాత్కాలిక నిషేధం విధించాలని పలువురు రిపబ్లిక్ సెనెటర్లు అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. కనీసం 60 రోజుల తాత్కాలిక నిషేధం విధించాలంటూ లేఖ రాశారు. ముఖ్యంగా హెచ్-1B వీసాలపై కనీసం ఏడాదిపాటు నిషేధం విధిస్తే.. అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థించారు. దీనిపై ట్రంప్ సర్కారు సీరియస్ గా ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో హెచ్-1B వీసాలపై దాదాపు 5 లక్షల మంది విదేశీయులు పని చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇందులో ఉన్నారు. హెచ్-1B వీసాలపై తాత్కాలిక నిషేధం విధిస్తే.. భారత ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది.
మరోవైపు అమెరికా ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకు కుదేలవుతోంది. వచ్చే త్రైమాసికం వరకు అమెరికా ఆర్ధిక వ్యవస్థ మైనస్ 15 నుంచి 20 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని వైట్ హౌస్ అధికారులు అంచనా వేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
H-1B వీసాలపై నిషేధం..?