అమృత్‌సర్ రైలు దుర్ఘటనపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి

అమృత్‌సర్ రైలు దుర్ఘటనపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి

Last Updated : Oct 20, 2018, 02:31 PM IST
అమృత్‌సర్ రైలు దుర్ఘటనపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి

అమృత్‌సర్ ఘోర రైలు దుర్ఘటనపై ప్రపంచ దేశాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రనీల్ విక్రమ సింఘే సహా ప్రపంచ నేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన రైలు దుర్ఘటనలో 59 మంది మరణించిన సంగతి తెలిసిందే.

భారతదేశంలోని పంజాబ్ అమృత్‌సర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. మృతి చెందిన కుటుంబాలను అండగా ఉండాలని, ఆదుకోవాలని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని వారు పంపిన సందేశంలో తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా మృతి చెందిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

'ఈ ఘోర రైలు దుర్ఘటనలో మొత్తం 59 మంది మృతి చెందారు. 57 మంది గాయపడ్డారు' అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మీడియాకి చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించిందని, నాలుగు వారాల్లో నివేదిక అందజేస్తుందని అన్నారు.

పంజాబ్ ప్రభుత్వం ప్రమాద బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పింది.

ప్రధాని నరేంద్ర మోదీ చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు.

పంజాబ్ ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించడంతో.. ఇవాళ అన్ని కార్యాలయాలు మరియు విద్యాసంస్థలు మూతపడ్డాయి.

రైలు ప్రమాదంపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ రైలు ప్రమాదం ఘటనపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పంజాబ్‌ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Trending News