''ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తప్పు చేశారని, ఆంధ్రా అంటే కేంద్రానికి అంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు '' అని ఆవేదన వ్యక్తంచేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. '' ఆంధ్రాకు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది. ఏపీ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష '' అని చంద్రబాబు విస్మయం వ్యక్తంచేశారు. మనం చేసేది ధర్మపోరాటం.. అటువంటప్పుడు అవిశ్వాసంపై చర్చించే బాధ్యత కేంద్రానికి లేదా ? అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. హామీలు అమలు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదని, కేంద్రానికి జవాబుదారితనం లేదా ? అని ప్రశ్నించారాయన. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి ఆవేదన, అదే కోపం మళ్లీ నిన్నటి అఖిలపక్ష సమావేశంలో కనిపించిందని అన్నారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ, జనసేన పార్టీ, బీజేపీ తప్ప మిగతా వాళ్లందరూ వచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.
ఓవైపు ఆంధ్రా ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్నప్పటికీ.. కేంద్రం పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోంది. ప్రధాని చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. నమ్మిన వాళ్లే మోసం చేస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలని చంద్రబాబు సభలో ఆవేదన వ్యక్తంచేశారు.