చిత్తూరు జిల్లాకు చెందిన అడిషనల్ ఎస్పీ జి.ఆర్ రాధిక డిసెంబరు 30న అర్జెంటీనాలో మౌంట్ అకోకాగువా (6,962 మీటర్లు) పైకి చేరుకొని కొత్త రికార్డు నెలకొల్పారు. దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి తెలుగు మహిళగా ఆమె ఘనత సాధించారు. ఈ మిషన్‌ను పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు, ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె మరో రెండు శిఖరాలను అధిరోహించడం ద్వారా 7-సమ్మిట్ వరల్డ్ సవాలును పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
రాధిక 2013లో పర్వతారోహణ శిక్షణ తీసుకున్నారు.అదే సంవత్సరంలో గోలెప్ కాంగ్రి మౌంటెన్ (లడఖ్, జమ్మూకాశ్మిర్), మౌంటెన్ మెంతోస(హిమాచల్ ప్రదేశ్), మౌంట్కున్ (కార్గిల్) పర్వతాలను అధిరోహించారు. 2016 మే నెలలో, ఆమె మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారిణిగా ఘనత సాధించారు.
2016 ఆగష్టులో ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో ఎక్కారు. మరుసటి సంవత్సరం మార్చిలో ఆమె మౌంట్ కోసిసుజ్కో ఎక్కారు. ఆస్సీ-10 పీక్ ఛాలెంజ్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఎత్తైన శిఖరం, మరో తొమ్మిది ఇతర శిఖరాలను అధిరోహించారు. తరువాత, సెప్టెంబర్ 7, 2017 తేదిన యూరప్‌లోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతుతో, నేను ఈ సంవత్సరం దెనాలి (అలాస్కా), విన్సన్ మన్స్టిఫ్ (అంటార్కిటికా) శిఖరాలను ఎక్కాలనుకుంటున్నా "అని రాధిక చెప్పారు. కలలను సాకారం చేసుకొనే బాలికలు, మహిళలకు ఆమె ఈ విజయాన్ని అంకితం చేశారు. వచ్చే వారంలో జి.ఆర్ రాధిక చిత్తూరుకు వస్తున్నారు. చిత్తూరు పోలీసులు ఆమెకు గొప్ప స్వాగతం పలకనున్నారు.