గన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఆదివారం ఉదయం చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు సభలో పాల్గొనేందుకు వస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురెళ్లి స్వాగతం పలికి, ప్రధానితోపాటే గుంటూరు వెళ్లాలనే ఆలోచనతో గన్నవరం విమానాశ్రయంలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నా లక్ష్మినారాయణను పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానిని కలిసే వారి జాబితాలో మీ పేరు లేదంటూ కన్నాను ఎయిర్‌పోర్టులోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏపీలో తానే పార్టీకి అధ్యక్షుడినని, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాను కూడా గుంటూరు వెళ్లాల్సి వుందని కన్నా లక్ష్మీ నారాయణ ఎంత నచ్చచెప్పినా పోలీసులు ఆయన మాట వినిపించుకోలేదు. దీంతో అక్కడ పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య కాసేపు వాగ్వీవాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు నల్ల దుస్తులు, నల్ల జండాలతో నిరసన తెలుపుతున్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధాని మోదీ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని టీడీపీ, వామపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో ప్రధాని గుంటూరు పర్యటనలో ఏం జరగనుందా అనే ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.