వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Last Updated : Oct 4, 2019, 11:13 PM IST
వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఏలూరు: ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి ముందుగా ఇచ్చిన హామీ ప్రకారమే నాలుగు నెలల్లోనే హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. సొంత ఆటో ఉన్న డ్రైవర్ల ఖాతాల్లో ఐదేళ్లలో రూ.50 వేలు జమ చేస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తింపచేస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద.. 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 1.73 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని.. సొంత ఆటో, తెల్ల రేషన్‌ కార్డు ఉంటే చాలు ఈ పథకానికి అర్హులు అవుతారని స్పష్టంచేశారు. 

దేశ చరిత్రలో ఈ తరహా ఆర్ధికసాయం ఇంతకు ముందెప్పుడూ, ఎక్కడా, ఎవరూ చేయలేదని అన్నారు. ప్రతీ పథకం అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, పార్టీలు చూడమని పునరుద్ఘాటించారు. 

ఇదే సభా వేదికపై నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓవైపు తాను మంచి చేస్తోంటే మరోవైపు చంద్రబాబు బండలు వేసే పని చేస్తున్నారని సీఎం జగన్‌ ఆరోపించారు. ఏమన్నా అంటే.. 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజు మద్యం షాపులు తెరిచారని.. చంద్రబాబు బండలు వేశారన్నారు. 20 శాతం మద్యం షాపులు కుదించామన్నారు. 43 వేల బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చేశామని తేల్చిచెప్పారు.

Trending News