Ap Rajyasabha Elections: ఏపీలో మరో నెలలో అంటే మార్చ్ నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అంటే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడున్న సమీకరణాల ప్రకారమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే మూడు స్థానాలు గెల్చుకోవల్సి ఉంది. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడితే పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న.
ఏపీలో త్వరలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడు స్థానాల ఎన్నికలు సాధారణ, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరగనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేల లెక్క పరిగణలో తీసుకుంటే వైసీపీ మూడు సీట్లు గెల్చుకునే అవకాశాలున్నాయి. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నోటీసుల నేపద్యంలో సమీకరణాలు మారి, ఫలితాలు మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించగా మరో 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సరైన వివరణ ఇవ్వని పక్షంలో వీరిపై కూడా వేటు పడనుంది. రాజ్యసభ స్థానాల్ని మొత్తం అసెంబ్లీ సీట్లతో విభజించగా వచ్చిన ఫలితానికి ఒకటి కలపాలి. అంటే రాష్ట్రంలో 175 స్థానాల్ని 3తో భాగించి...1 కలిపితే 43.75 అంటే...సరాసరి తీసుకుంటే ఒక్కొక్క రాజ్యసభ స్థానం గెలవడానికి 44 ఎమ్మెల్యేల ఓట్లు అవసరమౌతాయి. అదే ఎమ్మెల్యేలపై వేటు పడితే భాగించాల్సిన సంఖ్య 165 అవుతుంది. అప్పుడు కావల్సిన ఓట్లు 43. అప్పుడు టీడీపీకు 18 మంది ఎమ్మెల్యేలు, వైసీపీకు 147 ఎమ్మెల్యేల బలం ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో వైసీపీ వరుసగా జాబితాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా చాలమందికి మొండి చేయి చూపిస్తుంటే మరికొంతమందికి స్థానభ్రంశం కలుగుతోంది. ఈ క్రమంలో టికెట్ దక్కనివారు అసంతృప్తిగా ఉన్నారు. మూడు రాజ్యసభ స్థానాలు గెల్చుకునేందుకు వైసీపీకు కావల్సిన సంఖ్యాబలం 123. అదనంగా ఉన్నది 24 మంది. ఇందులో అసంతృప్తులు ఎంతమంది బయటకు వెళ్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. టీడీపీ కూడా వైసీపీ నుంచి వచ్చే అసంతృప్తులపై ఆశలు పెట్టుకుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసినట్టు చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
అయితే అసంతృప్తులు టీడీపీకు ఓటేసినా తమకు అదనంగా ఉన్నది 24 ఎమ్మెల్యేలు కాబట్టి ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చనేది వైసీపీ ఆలోచనగా ఉంది. ఏం జరుగుతుందనేది అందుకే ఆసక్తిగా మారుతోంది.
Also read: AP Survey 2024: ఉత్కంఠ రేపుతున్న తాజా సర్వే, పార్టీలకు చెమట్లు పట్టిస్తున్న ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook