టీడీపీ నేతలపై ఏపీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ నేతలపై ఏపీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Aug 12, 2019, 09:20 PM IST
టీడీపీ నేతలపై ఏపీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు

శ్రీకాకుళం: టీడీపీ నేతలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జిల్లాలో పర్యటించిన స్పీకర్ తమ్మినేని.. కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ.. "సీఎం వైఎస్ జగన్ సుధీర్ఘకాలం చేపట్టిన పాదయాత్రలోంచి వచ్చిన ఆలోచనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. వాలంటీర్ల ఎంపికపై టీడీపీ కౌన్‌ కిస్కా గొట్టంగాళ్లు పిటిషన్ వేస్తే భయపడొద్దు.. మీ పని మీరు చేసుకోండి.. మీ వెనకాల మేమున్నాం" అని చెప్పే క్రమంలో టీడీపీ నేతలను 'కౌన్‌ కిస్కాగాళ్లు' అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. 

స్పీకర్ రివ్యూలు ఎలా చేస్తారని కొంతమంది అజ్ఞానులు తనను విమర్శిస్తున్నారన్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. "తాను మొదట ఆముదాలవలస ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే స్పీకర్‌ను" అని గుర్తుచేశారు. తనను గెలిపించిన ప్రజలకు సమస్యలు ఎదురైతే... వారికి నాయకుడిగా వాటిని తాను కాక ఇంకెవరు పరిష్కరించాలి? అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. స్పీకర్‌గా తనకు విశేష అధికారాలు ఉన్నాయనే విషయాన్ని తనపై విమర్శలు చేసే వాళ్లు తెలుసుకోవాలని స్పీకర్ తమ్మినేని హితవు పలికారు. 

ఇదిలావుంటే, స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన అసెంబ్లీ స్పీకర్‌లా కాకుండా ఒక వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Trending News