ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను మళ్లీ నిర్వహించాలని వస్తున్న అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవలే నిర్వహించిన టెట్ పరీక్షల్లో చాలా తక్కువమంది మాత్రమే అర్హత సాధించడంతో పాటు ఆన్లైన్ టెస్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు రావడంతో.. మళ్లీ పరీక్షను నిర్వహించాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ముఖ్యంగా భాషా పండితుల విషయంలో చాలా ఆలస్యంగా సిలబస్ ప్రకటించడంతో.. ప్రిపరేషనుకు సమయం వెచ్చించలేకపోయామని కూడా పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని టెట్ పరీక్షను మళ్లీ నిర్వహించే అవకాశం అయితే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ టెట్ నిర్వహించాల్సి వస్తే.. ఎప్పుడు నిర్వహించాలి అనే అంశంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా ఏప్రిల్‌లో తాజా నోటిఫికేషన్ ఇచ్చి.. మేలో పరీక్షలు నిర్వహించవచ్చని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని రాష్ట్రప్రభుత్వం డిసెంబర్లో జీవో 91 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం మరోసారి టెట్ నిర్వహిస్తే బాగుంటుందని తాము ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని టెట్ కన్వీనరు ఎ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఈ టెట్‌ను డీఎస్సీ ప్రకటన వెలువడేలోపే నిర్వహించాలని తెలిపామని ఆయన అన్నారు. డిసెంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేసి.. జూన్ 11లోపు అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తామని గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
అయితే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోగా, మరో టెట్ నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలు అన్నీ కొలిక్కి వచ్చేసరికి డీఎస్సీ వాయిదా పడే అవకాశం అయితే ఉందనేది మాత్రం సత్యం. మరొక విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ డీఎస్సీ పోస్టులకు సంబంధించి.. దాని ప్రకటనకు సంబంధించి ఆర్థిక శాఖ నుండి ఎలాంటి అనుమతి లభించలేదు. ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు.. శనివారం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో మళ్లీ భేటీ అవ్వనున్నారు.