Athmakuru By Election Result 2022: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. నియోజకవర్గంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.దాదాపు 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ నెల 23న ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. గతంలో 83.32 శాతం ఓటింగ్ నమోదవగా.. ఈసారి 64.14 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఈ ఉపఎన్నికలో లక్ష మెజారిటీ సాధిస్తామని ధీమాగా చెప్పిన వైసీపీకి తగ్గిన ఓటింగ్ శాతం ఒకింత షాకే అని చెప్పాలి. ఉపఎన్నిక కోసం విస్తృతంగా ప్రచారం చేసిన వైసీపీ.. ఓటర్లను పోలింగ్ బూత్‌కి తరలించడంలో విఫలమైంది.
వైసీపీ తరుపున మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ తరుపున భరత్ కుమార్ ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ప్రజల్లో నెలకొన్న సానుభూతి, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, గడప గడపకు చేసిన ప్రచారం తమకు భారీ మెజారిటీ కట్టబెడుతుందని వైసీపీ ధీమాగా ఉంది. అయితే పోలింగ్ శాతం బాగా తగ్గిన నేపథ్యంలో లక్ష మెజారిటీ సాధ్యమేనా అన్నది చూడాలి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 2314 మాత్రమే. ఈ ఉపఎన్నికలో ఆ పార్టీ ప్రభావం చూపిస్తుందా.. గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయా చూడాలి. ఒకవేళ వైసీపీకి లక్ష మెజారిటీ తగ్గితే నైతికంగా ఓడిపోయినట్లేనని బీజేపీ వాదించే అవకాశం లేకపోలేదు.
3 లోక్‌సభ 7 అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు :
ఆత్మకూరు సహా దేశవ్యాప్తంగా జరిగిన 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంఘఢ్, పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానాలతో పాటు త్రిపురలోని అగర్తలా, జుబరాజ్‌నగర్, సుర్మా, బార్దౌలి, ఢిల్లీలోని రజీందర్ నగర్, జార్ఖండ్‌లోని మందార్, ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఉపఎన్నికలు జరిగాయి. నేడు ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే ఉంది.
Also Read: Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు
Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.