డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో మరో ఏపీ ప్లేయర్

 శ్రీకాంత్ అసామాన్యమైన ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆయనను డిప్యూటి కలెక్టరుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

Last Updated : Dec 2, 2017, 04:36 PM IST
 డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో మరో ఏపీ ప్లేయర్

ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌కు మరో అరుదైన ఘనత దక్కింది. ఇటీవలే నాలుగు సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్స్ కైవసం చేసుకున్న ఈ గుంటూరు క్రీడాకారుడికి ఒక ప్రత్యేక గౌరవాన్ని అందించింది ఏపీ ప్రభుత్వం. శ్రీకాంత్‌కు డిప్యూటి కలెక్టర్ హోదా కట్టబెడుతూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు శనివారం శాసనసభ ఆమోదం తెలిపింది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు డిప్యూటి కలెక్టర్ హోదా కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే శ్రీకాంత్ ప్రపంచ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రీకాంత్ అసామాన్యమైన ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆయనను డిప్యూటి కలెక్టరుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరి 7, 1993 తేదీన గుంటూరులో జన్మించిన కిదాంబి శ్రీకాంత్, గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడు. నవంబరు 16, 2014 తేదీన ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరొంది అభిమానులచే "సూపర్ డాన్"గా పిలుచుకోబడే చైనా ఆటడాడు లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచిన శ్రీకాంత్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బ్యాడ్మింటన్ క్రీడలో ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి బ్యాడ్మింటన్ ఆటగాళ్ళలో కిదాంబి శ్రీకాంత్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు.

Trending News