బీజేపీ, సీపీఎం, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Last Updated : Apr 13, 2018, 10:00 AM IST
బీజేపీ, సీపీఎం, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ భీమవరంలో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి మాణిక్యాల రావుతో కలిసి బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకాశం చౌక్‌లో దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అయితే, అదే సమయంలో కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపికి వ్యతిరేక నినాదాలు చేస్తూ పలువురు సీపీఎం, వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజీపే శ్రేణులు, సీపీఎం, వైఎస్సార్సీపీ వర్గాలకు మధ్య వాగ్వీవాదం చోటుచేసుకుందని సమాచారం. గోకరాజు గంగరాజు దీక్షను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ప్రకాశం చౌక్‌లో గురువారం ఉదయం దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

అక్కడే వున్న పోలీసులు కలగచేసుకుని ఇరువర్గాలను ఘర్షణ పడకుండా నిరోధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కాసేపటి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఎంపీ గోకరాజు గంగరాజు తన నిరహార దీక్షను కొనసాగించారు.

Trending News