ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయా లేక వేర్వేరుగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనే సందేహాలు సగటు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి.

Last Updated : Jan 24, 2019, 02:44 PM IST
ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్

అమరావతి : తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయా లేక వేర్వేరుగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనే సందేహాలు సగటు ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఉమెన్ చాందీ.. ఏపీలో పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఉమెన్‌ చాందీ స్పష్టంచేశారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉమెన్ చాందీ మాట్లాడుతూ.. ''ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతాం'' అని స్పష్టం చేశారు. 

ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు అని చెబుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతోనే ఉంటారని చాందీ వ్యాఖ్యానించారు. అయితే, ఒకవేళ పొత్తులపై ఆలోచించాల్సి వస్తే, ఆ అంశంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా ఉమెన్ చాందీ పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలకొస్తే, ఇవాళే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలి అడుగేసిన ఆమెకు తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Trending News