ఆనాటి విధ్వంసకాండకు నేటితో ఐదేళ్లు..

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటితో ఐదేళ్లు పూర్తయింది.

Last Updated : Feb 21, 2018, 01:29 PM IST
ఆనాటి విధ్వంసకాండకు నేటితో ఐదేళ్లు..

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటితో ఐదేళ్లు పూర్తయింది. ఉగ్రవాదుల దుర్మార్గపు దుశ్చర్యకు అయిన వారిని కోల్పోయిన హృదయాలని జీవితాంతం వెంటాడే ఈ దుర్ఘటన ఇంకెంతో మందిని జీవితాంతం జీవచ్చవాలని చేయడం బాధాకరం. ఆ దుర్ఘటన గుర్తొస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్నారు దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల బాధితులు. 

అది 2013, ఫిబ్రవరి 21వ తేదీ. సమయం రాత్రి ఏడు గంటలు అవుతుండగా దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ సమీపంలో కొద్ది క్షణాల వ్యవధిలోనే స్వల్ప దూరంలోనే ముష్కరులు టిఫిన్ బాక్సులలో అమర్చిన రెండు బాంబులు పేలాయి. ముష్కరులు జరిపిన ఈ జంట పేలుళ్లలో 19 మంది దుర్మరణం పాలుకాగా మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొంతమంది శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడి జీవచ్చవాలుగా వీల్ చైర్లకే పరిమితమైన వాళ్లూ వున్నారు. అందుకే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వారికి ఓ పీడకలగా మిగిలిపోయింది. నాటి చేదు జ్ఞాపకాన్ని తల్చుకుంటూ ఆ రోజు జరిగిన మొత్తం ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. 

ముష్కరుల దుశ్చర్యకు ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా తేదీలను ఓ సెంటిమెంట్‌గా పెట్టుకుని దాడులకి పాల్పడే ఉగ్రవాదుల నుంచి ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా మంగళవారమే దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు ఆ ప్రాంత పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి అదనపు బలగాలను మొహరించారు. 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్‌కి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలంలో లభించిన కీలక ఆధారాలు, సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు వారిని అరెస్టు చేశారు. 

రియాజ్ భత్కల్ (ఏ 1), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తార్ అలియాస్ హడ్డీ ( ఏ 2 ), బీహార్‌కు చెందిన మహమ్మద్ తహాసీన్ అక్తార్ ( ఏ3 ), పాకిస్తాన్‌కు జియా ఉర్ రహ్మన్ అలియాస్ వఖాస్ ( ఏ 4 ), కర్నాటకకు చెందిన మహమ్మద్ అహ్మద్ సిదిబాప అలియాస్ యాసిన్ భత్కల్ ( ఏ 5 ), మహారాష్ట్రకు చెందిన ఎజాజ్ సయీద్ షేక్ ( ఏ 6 ) గా ఎన్ఐఏ గుర్తించింది.  

ఎన్ఐఏ చార్జ్ షీట్,  హైదరాబాద్ పోలీసుల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని కేసుని విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2016, డిసెంబర్ 19వ తేదీన ఐదుగుర్ని దోషులుగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించిందిన సంగతి తెలిసిందే. 

Trending News