అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల రీపోలింగ్‌కి ఆదేశాలు జారీచేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్‌తో పాటు నరసారావుపేటలోని 94వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇసి స్పష్టంచేసింది. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్య చెలరేగిన ఘర్షణ రెండు చోట్ల పోలింగ్‌పై ప్రభావం చూపినట్టు గుర్తించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ జరిగిన రోజు అర్ధరాత్రి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉండడంతో అధికారులు 300 వరకు స్లిప్పులు పంపిణీ చేశారు. అయితే ఈ పోలింగ్ బూత్‌కు ఎలాంటి ప్రహరీ లేకపోవడంతో చాలా మంది ఓటర్లు క్యూలైన్లలో కలిసిపోయారు. దీంతో పంపిణీ చేసిన స్లిప్పుల కన్నా పోల్ అయిన ఓట్లు అధికంగా ఉండటం స్థానికంగా ఆందోళనకు దారితీసింది.
రాత్రి పొద్దుపోయే వరకు పోలింగ్ జరుగుతున్నట్టు తెలుసుకున్న ఎంపీ అభ్యర్థులు గల్లా జయదేవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సహా ఇతర పార్టీల నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి కాస్తా ఇంకాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. చివరకు రాత్రి 11.30 గంటలకు రిటర్నింగ్ అధికారి పోలింగ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక నరసారావుపేటలోని కేసానుపల్లి గ్రామంలోని 94వ బూత్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పిదం కారణంగా తప్పనిసరిగా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. యధావిధిగా పోలింగ్ బూత్‌లో ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు 50 ఓట్లు వేశారు. మాక్ పోలింగ్ ముగించిన అనంతరం వీవీ ప్యాట్‌లో 50 స్లిప్‌లను తొలగించిన అధికారులు ఈవీఎంలలో మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయడం మర్చిపోయారు. దీంతో తనిఖీల్లో 50 ఓట్లు అధికంగా రావడం గందరగోళానికి దారితీసింది. ఈ కారణంగానే ఈ పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ అనివార్యమైనట్టు ఇసి పేర్కొంది.