ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదు: చంద్రబాబు

తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన టీడీపీ ధర్మపోరాట సభ ముగిసింది.

Last Updated : May 2, 2018, 08:46 AM IST
ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం ఆగదు: చంద్రబాబు

తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన టీడీపీ ధర్మపోరాట సభ ముగిసింది. సభలో టీడీపీకి చెందిన పలువురు నేతలు ప్రసంగించారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన హామీల వీడియోను ప్రజలకు చూపించారు. అనంతరం కేంద్రం రాష్ట్రానికి చేసిన నమ్మకద్రోహాన్ని వివరించారు. ప్రజలందరూ మోదీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. పోరాటం ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కేంద్రం సహకారం అందించకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం సాయం చేయకున్నా అభివృద్ది ఆగిపోరాదని అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకివ్వరో చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ధర్మ పోరాటంలో అంతిమ విజయం తమదేనని, దానిని ఎవరూ ఆపలేరన్నారు.

"14వ ఆర్థిక సంఘం సిఫారసుల తరువాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని చెప్పారు. అందుకే ఏపీకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామన్నారు. మనం కూడా అంగీకరించాం. ఆ తరువాత వేరే రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పొడిగించారు. అప్పుడే మనం ఆ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాకూ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాం. కానీ కేంద్రం మొహం చాటేసింది" అని చంద్రబాబు అన్నారు. నాడు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని మాట ఇచ్చిన మోదీయే అమరావతి నిర్మాణం కోసం ఈ నాలుగేళ్లలో కేవలం రూ.1500 కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు అన్నారు. నాడు మోదీ  తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇవన్నీ నాడు సాక్షాత్తూ నరేంద్రమోదీ చెప్పిన మాటలని, వాటిని ఎందుకు అమలు చేయరని నిలదీయడం తప్పా అని అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు.

Trending News