ధవళేశ్వరంలో గోదావరి ప్రచండ రూపం.. వరదనీటితో అల్లకల్లోలం

తూర్పుగోదావరి రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉప్పొంగడంతో.. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటితో స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

Last Updated : Aug 17, 2018, 03:42 PM IST
ధవళేశ్వరంలో గోదావరి ప్రచండ రూపం.. వరదనీటితో అల్లకల్లోలం

తూర్పుగోదావరి రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉప్పొంగడంతో.. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటితో స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఈ రోజు తెల్లవారుఝామున 9.6 అడుగుల నీటి మట్టం ఉండగా.. 11:30 గంటలకు అదే నీటిమట్టం11.75 అడుగులకు  చేరుకుంది. ఇక భద్రాచలం వద్ద కూడా వరదనీరు ధారాళంగా ప్రవహిస్తోంది.

చింతూరు మండలం వద్ద కూడా అదే పరిస్థితి తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌‌  రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.  దేవీపట్నం మండలంలోని సీతపల్లివాగు దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ధవళేశ్వరంలో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇక కోనసీమలో కూడా గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదీపాయలు ఏకధాటిగా ప్రవహిస్తూనే ఉన్నాయి.  చాకలిపాలెం వద్ద ఉన్న  కాజ్‌వే కూడా వరదనీటిలో మునిగిపోయంది. 

ఈ వరదల వల్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే పనులు ఆగిపోయాయి. ఈ సాయంత్రానికి గోదావరి ప్రాంతాల్లో వరదనీరు మరింత పెరిగి అవకాశం కనిపిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేసి.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని ప్రజలకు సమాచారమిస్తున్నారు. గోదావరి ఉపనదులైన తాలిపేరు, కిన్నెరసాని, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు. ఈ వరదల వల్ల ఇప్పటికే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 

Trending News