High Tension in Konaseema: ఏపీలో అమలాపురం కేంద్రంగా కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పేరు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ జిల్లా పేరును ప్రభుత్వం డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడంతో వివాదం మొదలైంది. అంబేడ్కర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ పలువురు నిరసనలకు దిగుతున్నారు. జిల్లాకు పాత పేరునే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం (మే 24) అమలాపురంలో జేఏసీ నేతలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది.
జిల్లాకు కోనసీమ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానిక ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి ప్రయోగించారు. రాళ్ల దాడిలో గన్‌మెన్‌కు గాయాలైనట్లు సమాచారం.
అమలాపురంలో ఆందోళనల నేపథ్యంలో సోమవారం (మే 23) నుంచి వారం రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. పట్టణంలోని పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడా ఆందోళనకారులు రోడ్డెక్కకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కానీ మంగళవారం మధ్యాహ్నం అనూహ్యంగా జేఏసీ నేత్రుత్వంలో పలువురు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం, ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నిరసన ర్యాలీ వెనుక టీడీపీ, జనసేన కుట్ర దాగుందని మంత్రి పినిపె విశ్వరూప్ ఆరోపించడం గమనార్హం.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం 'కోనసీమ జిల్లా'గా ఏర్పాటు చేసింది. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కోనసీమ జిల్లాను డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటినుంచి దీనిపై వివాదం రాజుకుంది. కోనసీమ పేరులోనే ఎంతో ప్రత్యేకత ఉందని... 'ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు' అని నినదిస్తూ స్థానికులు కొందరు ఆందోళన కార్యక్రమాలకు దిగారు. మరోవైపు, జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లా గానే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు ఈ వివాదం ముదురుతుండటంతో చివరకు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read: Numerology Radix: పవర్‌ఫుల్ ర్యాడిక్స్ 8.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ ఏడాదంతా అదృష్టమే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook