రాజధానికి నిధులు రాకూడదని.. ప్రపంచ బ్యాంకుకు వారే చెప్పారు: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుకుంటుంది వైఎస్సార్ పార్టీ అని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Last Updated : Oct 10, 2018, 01:23 PM IST
రాజధానికి నిధులు రాకూడదని.. ప్రపంచ బ్యాంకుకు వారే చెప్పారు: గంటా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుకుంటుంది వైఎస్సార్ పార్టీ అని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రైతుల పేర్లతో ప్రపంచ బ్యాంకుకి నకిలీ ఈమెయిల్స్ పంపిస్తూ.. ఆ పార్టీ రాష్ట్ర ప్రజలకు నమ్మకద్రోహం చేస్తుందని ఆయన అన్నారు.  ప్రభుత్వ పథకాలను అడ్డుకోవడమే వైఎస్సార్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని.. అలాగే ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై కూడా కల్లిబొల్లి మాటలు చెబుతూ.. యువతీ యువకులను రెచ్చగొడుతుందని గంటా అన్నారు.

వైఎస్సార్ పార్టీ నేతలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని.. వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కూడా ఎటువంటి ప్రయత్నాలు చేసిన పాపాన వారు పోలేదని తెలిపారు. 2019లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోని పరిస్థితికి వైఎస్సార్ పార్టీ చేరుతుందని.. తాను అన్నమాట కచ్చితంగా నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. మునిగిపోయే పడవ లాంటి పార్టీకి జగన్ సారథ్యం వహిస్తున్నారని గంటా ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు లాంటి నిజాయతీగల వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని గంటా అభిప్రాయపడ్డారు.

జగన్ మాట్లాడే మాటలు జోక్ ఆఫ్ ది డికేడ్‌లా మిగిలిపోతాయని గంటా అన్నారు. జగన్ పై ఉన్న కేసులు దేశంలో ఏ ఇతర నేతపై కూడా లేవని.. ఈ విషయంలో జగన్ రికార్డు నమోదు చేశారని గంటా తెలిపారు. చంద్రబాబును విమర్శించే స్థాయికి ఈ రోజు జగన్ చేరారని.. తనకైతే ఈ విషయంలో దెయ్యం వేదం వల్లిస్తున్న అభిప్రాయం కలుగుతుందని గంటా ప్రతిపక్షనేతపై విరుచుకుపడ్డారు. అమరావతి శంకుస్థాపన జరిగే సమయంలో ఆహ్వానం ఇవ్వడానికి వెళ్లిన మంత్రులను జగన్ రావద్దని చెప్పారని.. దీని బట్టే ఆయన సంస్కారమేమిటో అర్థమవుతుందని గంటా అన్నారు. దేశంలో ధర్మపోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

Trending News