చంద్రబాబు అక్రమ మైనింగ్ ఆపి ఉంటే.. అరకులో హత్యలు జరిగేవి కావు: పవన్ కళ్యాణ్

అరకు నియోజకవర్గంలోకి వచ్చే గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాల పై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండాల్సిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Last Updated : Sep 24, 2018, 08:34 PM IST
చంద్రబాబు అక్రమ మైనింగ్ ఆపి ఉంటే.. అరకులో హత్యలు జరిగేవి కావు: పవన్ కళ్యాణ్

అరకు నియోజకవర్గంలోకి వచ్చే గూడ గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాల పై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉండాల్సిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అలా స్పందించి ఉంటే నేడు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చుండేది కాదని అన్నారు. ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వారి మరణం పట్ల పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అరకులోని గూడ గ్రామంలో కూడా సందర్శించారు.

అక్కడ క్వారీల తవ్వకాల వల్ల కలుషితమైన తాగునీటిని గ్రామస్తులే పవన్ కళ్యాణ్‌కు చూపించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేస్తున్న అక్రమ క్వారీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూల్ జిల్లా హత్తిబెలగల్ గ్రామంలో నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ తవ్వకాలు జరిగిన సమయంలో కూడా..  పేలుడు వల్ల మరణించిన 12 మంది కార్మికులు మరణించినప్పుడు.. ప్రభుత్వం చర్యలు తీసుకొని అలాంటి క్వారీలు మూసివేయాలని పవన్ డిమాండ్ చేశారు. 

ఈ అక్రమ క్వారీ తవ్వకాలపై తాజాగా పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు విషయాలు తెలియజేశారు. గూడ గ్రామస్తులు గతంలో అక్రమ మైనింగ్ విషయంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఈ ఉదాసీన వైఖరి వల్లే నేడు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వం ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. 

Trending News