మెడికోలకు నిర్వహించే నీట్ పీజీ ఎగ్జామినేషన్‌లో ఆంధ్రా మెడికో ఎన్ ఉమా మహేశ్వరి టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. తాజాగా వెల్లడైన నీట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ అర్హత పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉమా మహేశ్వరి 16వ ర్యాంక్ సాధించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణురాలైన ఉమా మహేశ్వరి.. ఎంసెట్ పరీక్షలోనూ రెండో ర్యాంక్ సొంతం చేసుకోవడం విశేషం.
స్కూల్లో చదువుకునే రోజుల నుంచే టాప్ ర్యాంకర్ అయిన ఉమామహేశ్వరి 2011లో తన తండ్రిని కోల్పోయారు. తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడం అనేది ఆమెపై బాగా ప్రభావం చూపించింది. అనారోగ్యంతో తండ్రి మృతిచెందడాన్ని కళ్లారాచూసిన ఉమామహేశ్వరి.. వైద్య రంగంలో నిపుణురాలిగా ఎదగాలని ఆ క్షణం నుంచే పట్టుదలతో కృషిచేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అతి క్లిష్టమైన నీట్ పీజీ ఎగ్జామినేషన్‌లో ఆమె 16వ ర్యాంక్ సాధించడం నిజంగా అభినందనీయం.