బెజవాడ దొంగలను పట్టించిన మొబైల్ యాప్

సైబర్ క్రైమ్ పోలీసులు.. డివైజ్‌ను కనిపెట్టడానికి తమ వద్ద ఉన్న అధునాతన సాంకేతికతతో పాటు గూగుల్ మ్యాప్స్ సహకారం కూడా తీసుకొని.. సెల్ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేశారు

Last Updated : Feb 2, 2018, 03:56 PM IST
బెజవాడ దొంగలను పట్టించిన మొబైల్ యాప్

విజయవాడ కొత్తపేట ప్రాంతంలో ఇటీవలే ఓ దొంగతనం జరిగింది. రైల్వేస్టేషన్ నుండి నడుచుకుంటూ వెళ్తున్న  ఓ వ్యక్తిని కొట్టి.. అతని సెల్‌ఫోన్‌ను తస్కరించారు దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి కంప్లైంట్ నమోదు చేస్తూ.. తన ఫోన్‌లో  ‘ఫైండ్‌ మై డివైజ్‌’ అనే మొబైల్ యాప్‌ ఉన్నట్లు తెలిపారు. ఆ ఫోన్‌‌లో మొబైల్ యాప్ ఉంది కాబట్టి.. దొంగలను ట్రేస్ చేయడం సులభం అవుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. డివైజ్‌ను కనిపెట్టడానికి తమ వద్ద ఉన్న అధునాతన సాంకేతికతతో పాటు గూగుల్ మ్యాప్స్ సహకారం కూడా తీసుకొని.. సెల్ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని ట్రేస్ చేశారు. ఈ ట్రేసింగ్‌లో ఆయా సెల్‌ఫోన్ విజయవాడ కొత్తపేట ఆంజనేయవాగు వద్ద ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ గాలింపు చర్యల్లో భాగంగా ఆంజనేయవాగు వద్ద ఆగిన మోటార్ సైకిళ్ళను గమనించి.. వాటి సంబంధీకులను పట్టుకొని విచారించగా మొత్తం వివరాలన్నీ బయటపడ్డాయి. కొందరు యువకులు గత కొంతకాలంగా దొంగతనాలకు మరిగి.. సెల్‌‌ఫోన్‌లు దొంగతనం చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం లాంటి నేరాలకు అలవాటు పడ్డారని.. ఈ క్రమంలో ఈ సారి కూడా అలాగే చేశారని తెలిసింది. అయితే ఒక మొబైల్ యాప్ ద్వారా పొందిన సమాచారంతోనే ఈ దొంగలను పోలీసులు ట్రేస్ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఈ కేసును చేధించిన సైబర్ క్రైమ్ పోలీసులను కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు. 

Trending News