15 ఏళ్ళ తరువాత మొదటిసారిగా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. వారికి మెజారిటీ ఉందని తెలుసు. కానీ ఈ అవిశ్వాసం మెజారిటీకి-నైతికతకు మధ్య జరుగుతోన్న పోరాటమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ఇచ్చామో జాతికి వివరించడానికి ఢిల్లీకి వచ్చానని జాతీయ మీడియాతో చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతిలో వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీని మరిచిపోయారని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు.. అయితే ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మించుకోవచ్చని నమ్మబలికారని.. ఆ తర్వాత పట్టించుకోలేదని అన్నారు.
14వ ఆర్థిక సంఘం పేరుతో హోదా అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కేంద్రంతో జతకట్టామని.. నాలుగేళ్లు చూశామని.. ఓపిక నశించిందని.. అందుకే కేంద్రం నుంచి.. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగామని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లీ పర్యటన చేశానన్నారు. ఏ రాష్ట్రానికి పన్ను రాయితీలు లేవన్నారని, కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇస్తున్నారన్నారని గుర్తుచేశారు.
వైకాపా ట్రాప్‌లో పడ్డారని ప్రధాని అన్నారని, తాను ఎప్పటికీ తప్పు చేయనన్నారు అవినీతిని అంతమొందిస్తామని చెప్పే మోదీ గాలి జనార్ధన్‌రెడ్డి వర్గానికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలు చేస్తూ తిరిగి నాపైనే విమర్శలు చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. తానెప్పుడూ యూటర్న్ తీసుకోలేదని, మీరు తప్పు చేశారు కాబట్టే నిలదీశానన్నారు. నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నామని..రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.