గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను విడదీసే సమయంలో తమదేం పోతుందన్న చందంగా ఉత్తరాది ప్రాంతాలకు చెందిన నాయకులు సభలో కాళ్ల ఊపుకుంటూ కూర్చున్నారని ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరాది వారిమి ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఏపీని విడగొట్టారని మండిపడిన పవన్ కల్యాణ్.. ఆ విషయాన్ని టీడీపీ, వైసీపీ మర్చిపోతాయేమోకానీ నిత్యం జనం కోసం పాటుపడే జనసేన పార్టీ కాదని అన్నారు. ఏపీని విడగొడుతుంటే ప్రేక్షకపాత్ర వహించిన ఉత్తరాది అహంకారం దించే వరకు జనసేన నిద్రపోదని చెబుతూ.. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు జనసేన నిద్రపోదని తేల్చిచెప్పారు. గుంటూరులోని ఎల్ఈఎం గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన జనసేన శంఖారవం సభలో పాల్గొన్న సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రభుత్వానికైనా, ఎన్నికలకైనా ఇంకా 90 రోజులే ఉన్నాయని... నిద్రాహారాలు మానుకుని పని చేసి పార్టీకి విజయం కట్టబెట్టాలని పార్టీ కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై పార్టీల వైఖరిని ఎండగట్టే క్రమంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని.. గజనీ చంద్రబాబుకు అప్పుడప్పుడు మాత్రమే అది గుర్తుకు వస్తుందని.. ఇక జగన్‌కు అయితే, అసలు హోదానే పట్టడం లేదని జనసేనాని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన నాయకులను ప్రశ్నిస్తున్నందుకు తమ కార్యకర్తల మీద ఎవరైనా చేయి వేస్తే, వారు ఏ స్థాయి నాయకులైనా వారి అంతు చూస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.