తెల్లవారితే రిపబ్లిక్ డే అనగా గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఓ శుభవార్త వినిపించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.285 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నాబార్డుకు ఓ సిఫారసు లేఖను పంపించింది. ఈ నిధుల విడుదల లేఖకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి సైతం అందించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రంపై వున్న అసంతృప్తిని కొంతమేరకు తగ్గించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ కూడా ఆనందం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. దీనికితోడు ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఏపీ ప్రభుత్వాన్ని తరచుగా ఇబ్బంది పెడుతుండటం గమనార్హం.