పవన్ యాత్రకు ..జగన్ యాత్ర అడ్డంకి

                             

Updated: Jul 12, 2018, 11:46 AM IST
పవన్ యాత్రకు ..జగన్ యాత్ర అడ్డంకి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జగన్ పాదయాత్ర రూపంలో ఆటంకం ఎదురైంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే ..ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాల్సి ఉంది.  ప్రస్తుతం తూర్పుగోదావరిలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా పవన్ యాత్రకు పోలీసులు అనుమతించడం లేదు.

పవన్ యాత్ర కుదరదన్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించిన పవన్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ప్రస్తుత సమయంలో పవన్ యాత్ర సాధ్యం కాదని..షెడ్యూల్ లో మార్పు చేసుకోవాల్సిందిగా  సూచించినట్లు సమాచారం. 

పవన్ యాత్ర షెడ్యూల్ లో మార్పులు
పోలీసుల అభ్యంతరం నేపథ్యంలో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకొని.. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను చేపట్టాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడక పోయినప్పటికీ ఈ నెల 16 వ తేదీ నుంచి పవన్ యాత్ర పశ్చిమ గోదావరిలో ప్రారంభమవుతుందని సమాచారం