అమరావతి: రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అర్హులకు కార్డు జారీ చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయం ద్వారా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి సభకు తెలిపారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ సమాధానం చెప్పారు. గతంలో రేషన్ కార్డుల కోసం ఇచ్చిన 1.39 లక్షల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా గతంలో పైరవీల ద్వారా పొందిన తెల్ల రేషన్ కార్డులపై విచారణ చేపడతామని మంత్రి ప్రకటించారు.
రేషన్ డీలర్లకు కమీషన్:
ఇక రేషన్ డీలర్ల విషయానికొస్తే, రేషన్ దుకాణాలను స్టాక్ పాయింట్లుగా వాడతామని చెప్పిన మంత్రి కొడాలి నాని.. డీలర్లను తొలగించడం లేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఇచ్చినట్లుగానే వారికి కమీషన్ ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం రీ సైక్లింగ్ అయ్యేవని, ఇకపై రేషన్ బియ్యం రీసైక్లింగ్ నివారించడానికి వీలుగా బ్యాగ్‌ల ద్వారా రేషన్ సరుకులు పంపీణి చేయబోతున్నట్టు మంత్రి వివరించారు. రేషన్ సరుకుల పంపీణీకి అవసరమైన బ్యాగుల కొనుగోలుకు ఏడాదికి రూ.400 కోట్లు కేటాయించామని, త్వరలో ఆన్లైన్ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి సభకు వెల్లడించారు.