కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ రెండు, మూడు సమావేశాలు నిర్వహించింది. ఆఖరికి అభ్యర్థి పేరును ప్రకటించింది. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి తెదేపా అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరును ఖరారుచేసింది. ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేఈ ప్రభాకర్, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి స్వయానా తమ్ముడు.
మంగళవారం కేఈ ప్రభాకర్ తెదేపా అభ్యర్థిగా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ అనుచరులతో కలిసి వెళ్లి కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
రాజకీయ జీవితం
కేఈ ప్రభాకర్ 1994లో క్రిష్ణగిరి జెడ్పీ స్థానం నుంచి పోటీచేసి రాజకీయ అరంగేట్రం చేశారు. అదే సంవత్సరం 'కోట్ల' కంచుకోట డోన్ స్థానం టీడీపీ తరుఫున పోటీచేసి గెలుపొందారు. 1999లో తిరిగి అదే స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో పత్తికొండ నుంచి పోటీచేసి గెలిచారు. అయితే 2014లో కర్నూలు ఎంపీ సీటు అడిగితే టీడీపీ కులసమీకరణాల కారణంగా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో ఇవ్వాలని అడిగితే.. ఐడీసీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. కేఈ ప్రభాకర్ 1995-2004 వరకు తొమ్మిదేళ్ల పాటు అటవీ, విద్య, నీటిపారుదల శాఖల మంత్రిగా సేవలందించారు.
శిల్పాచక్రపాణి ఎమ్మెల్సీ పదవికి, తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొద్దిరోజులుగా అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ సమాలోచనలు, మంతనాలు, సమావేశాలు నిర్వహించి.. కేఈ ప్రభాకర్ పేరును ప్రకటించారు.