'హోదా' తప్ప ఆ తరహా సాయం చేసేందుకు సిద్ధం: బీజేపీ

ప్రత్యేక హోదా అనే పదం తప్ప ఆర్థికంగా అందాల్సిన మిగతా సహాయాన్ని అందించడానికి కేంద్రం సుముఖంగా ఉంది: బీజేపీ

Last Updated : Apr 5, 2018, 08:49 AM IST
'హోదా' తప్ప ఆ తరహా సాయం చేసేందుకు సిద్ధం: బీజేపీ

న్యూఢిల్లీ: టీడీపీని బీజేపీ నుంచి వేరుచేయడంలో వైసీపీ పార్టీ సక్సెస్‌ అయిందని బీజేపీ పార్టీ ఎంపీలు ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు‌, గోకరాజులతో కలిసి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అతన నివాసంలో సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న స్నేహం చెడిపోవాలని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉందని, వైఎస్సార్‌సీపీ పన్నిన రాజకీయ ఉచ్చులో టీడీపీ పడిపోయిందని హరిబాబు తెలిపారు.

బీజేపీకి, వైసీపీకి మధ్య ఎలాంటి రాజకీయ సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు స్పష్టం చేశారు.  టీడీపీ, వైసీపీ ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నంలోనే బీజేపీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయాలు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా అనే పదం తప్ప ఆర్థికంగా అందాల్సిన మిగతా సహాయాన్ని అందించడానికి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. ఎస్పీవీ ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం కోరితే రాష్ట్ర ప్రభుత్వమే స్పందించలేదన్నారు. కేంద్రం రూ. 15వేల కోట్ల ప్రయోజనం కల్పిస్తామంటే.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. చంద్రబాబు భ్రమలు కలిగించే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ పర్యటన చేపట్టి చంద్రబాబు తన బలహీనతను బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి అంటే అమ్మో అవినీతి అని భయపడుతున్నారని ఆరోపించారు. ఇస్తామన్న నిధులను తీసుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని..ఇచ్చిన నిధుల గురించి చెప్పకపోగా.. ఎదురుదాడికి దిగడం సరికాదని హితవు పలికారు.

Trending News