న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇస్తూ తమ నలుగురిని రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి లేఖ అందజేశారు. ఈ లేఖపై సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ సంతకాలు చేశారు. సుజనా చౌదరి రాజ్యసభలో టీడీపీకి కీలకంగా వ్యవహరించడంతోపాటు 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అయిన తర్వాత టీడీపి ఎన్డీయేకి భాగస్వామిగా వున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రిగానూ పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇదిలావుంటే, టీడీపికి చెందిన ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించినట్లు తెలుస్తోంది. నలుగురు టీడీపి ఎంపీలు వెంకయ్య నాయుడుకు లేఖ ఇచ్చిన సమయంలో బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం వారితోనే వున్నారు.