చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ: ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు భేటీ అయ్యారు.

Last Updated : Mar 31, 2018, 10:43 AM IST
చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ: ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా తెచ్చుకోవడం కోసం చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విభజన హామీల కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమవంతు సహాయం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

టాలీవుడ్ సైతం ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుందని పేర్కొన్నారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, కె ఎస్ రామారావు, కె ఎల్ నారాయణ, జెమిని కిరణ్, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సందర్భంగా నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించారు. ఏప్రిల్ 6వ తేది వరకు టాలీవుడ్‌లో పనిచేసేవారందరూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించనున్నట్లు ప్రకటించారు.

ఇటీవలే ప్రత్యేక హోదా పోరాట సమితి, మా సంఘం అధ్యక్షుడు శివాజీరాజాని కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు మళ్లీ ప్రత్యేకంగా సీఎం చంద్రబాబును కలిసి.. ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు ఇస్తున్నామని చెప్పడం గమనార్హం.

Trending News