Leopard Kills Lakshitha: తిరుపతి: తిరుపతి పద్మావతి అతిధి గృహంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన హై లెవెల్ కమీటి సమావేశం ముగిసింది. నెలన్నర క్రితం కాలి నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి ఘటనతో పాటు ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిన ఘటనల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కాలి నడకన తిరుపతికి వచ్చే భక్తులకు భద్రత అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై టీటీడీ బోర్డ్ ఇవాళ్టి హై లెవెల్ కమిటీ మీటింగ్ లో చర్చించింది.
భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం అని చెప్పిన టిటిడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. భక్తుల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. టీటీడీ బోర్డ్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల భక్తులను వరకే భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించరు. రాత్రి 10 గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుంది.
ప్రతీ ఒక్కరికీ ఒక ఊతకర్ర ఇస్తాం :
నడక మార్గంలో వెళ్ళే ప్రతీ భక్తుడికి ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే స్వీయరక్షణ కోసం ఒక ఊతకర్ర ఇస్తాం. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే అనుమతించడం జరుగుతుంది. భక్తుల భధ్రత దృష్ట్యా ఎంత మందిని అవసరమైతే అంతమందిని అటవీ శాఖ సిబ్బందిని నియమించుకుంటాం. నడక మార్గంలో కొండపైకి వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపేందుకు నిర్ణయం తీసుకున్నాం. నడక దారిలో, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు అందించే ఘటనల వల్ల కూడా భక్తులపై జంతువుల దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే అక్కడక్కడ నియమించే అటవీ శాఖ సిబ్బందితో నిఘా పెట్టి ఇకపై భక్తులు అలాంటి చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటాం.
ఫెన్సింగ్ ఏర్పాటుపై...
దాదాపు ఐదు వందల ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నాం. అవసరం అయితే డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తాం. అవసరం అయితే నడక దారిలో ఫొకస్ లైట్స్‌ను ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుండి సూచనలు తీసుకున్నాం. కేంద్ర అటవీ శాఖ అధికారులకు ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తాం. అలిపిరి, 7వ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. అప్రమత్తత కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భక్తుల ప్రాణరక్షణే ప్రధమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని టిటిడి బోర్డు వెల్లడించింది.
కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. 15 వేల మందికి ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నాం. దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు ఏవిధంగా నైనా తిరుమలకు చేరుకోవచ్చు. వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇదే నిబంధనలు అమలు చేస్తాం. వన్యప్రాణుల అధ్యయనం కోసం అటవీ శాఖ అధికారులకు టిటిడి వైపు నుండి అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. ప్రతినిత్యం భక్తులు సురక్షితంగా తిరుమలకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.