New Cars Price Hike: కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇండియాలో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతి సుజుకి బ్యాడ్ న్యూస్ చెప్పింది. 2023 జనవరి నుంచి.. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలు పెంచేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది. మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లలో మోడల్స్ వారీగా కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారమే మారుతి సుజుకి ఇండియా నుంచి ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న నష్టాలతో పాటు కార్ల తయారీ వ్యయం పెరుగుతుండటం వల్ల కంపెనీపై ఆర్థికంగా కొంత అధిక భారం పడుతోందని మారుతి సుజుకి ఇండియా అభిప్రాయపడింది. కంపెనీపై పడుతున్న ఆర్ధిక భారాన్ని, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కార్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతి సుజుకి ఇండియా తమ ప్రకటనలో పేర్కొంది. అంటే తమకు ఇష్టం లేనప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించేందుకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనను మారుతి సుజుకి ఇండియా కంపెనీ వినిపించింది.
2023 జనవరి నుంచే మారుతి సుజుకి కార్ల ధరలు పెంపు వర్తించనుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ తరువాత కొత్తగా కారు బుక్ చేసుకునే వారు ఇంకొంత అధిక మొత్తంలో ఖరీదు చెల్లించుకోక తప్పదు. ఇది కొత్తగా మారుతి సుజుకి ఇండియా కంపెనీకి చెందిన కారులను కొనుగోలు చేయాలనుకునే వారికి అదనపు భారం కానుంది.
తరచుగా కొత్త కార్లు మార్చే వారిలో ఒక అలవాటు ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా కారు కొనుగోలు చేయాలని కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఇంకొంతమంది కొత్త ఏడాది వస్తోంది కాబట్టి అప్పుడు ఆఫర్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు కారు కొనకుండా ఆగుతుంటారు. అలాంటి వారు అందరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. వేరే కంపెనీకి చెందిన కారు కొనేవారిపై ఈ నిర్ణయం అంతగా ప్రభావం చూపకపోవచ్చునేమో కానీ మారుతి సుజుకి కారు మాత్రమే కొనాలని భావించే వారు మాత్రం వెంటనే అలెర్ట్ అవ్వాల్సిన సమయం ఇది.
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారు ముఖ్యంగా గమనించాల్సిన మరో అంశం ఏంటంటే.. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్‌లో అతి పెద్ద కంపెనీ మారుతి సుజుకి ఇండియానే. ప్రస్తుతానికి అత్యధిక ఆర్డర్స్ కలిగిన కంపెనీల్లో మారుతి సుజుకినే ముందుంటుంది. అలాంటి పెద్ద కంపెనీయే నష్టాలను అధిగమించడానికి ధరలు పెంచక తప్పదని నిర్ణయించుకున్నప్పుడు.. మిగతా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంపెనీలు కూడా మారుతి సుజుకి బాటలోనే వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కానీ జరిగితే.. ఆ తరువాత ఏ కంపెనీ కారు కొన్నా.. అధిక ధరలు చెల్లించక తప్పదు. అందుకే కొత్తగా కారు కొనేవారు వెంటనే అప్రమత్తమై నిర్ణయం తీసుకోక తప్పదు మరి.