Bihar Thieves steal Mobile Tower: పాట్నా: కాదేది కవితకు అనర్హం అనేది పాత నానుడి కాగా కాదేది చోరీకి అనర్హం అన్నట్టుగా ఉంది లేటెస్ట్ ట్రెండ్. గతంలో దొంగలు ఇంట్లో నగలు ఎత్తుకెళ్లడం, నగదు దోచుకెళ్లడం చూశాం. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న వాహనాలు చోరీ అవడం కూడా సర్వసాధారణమే. కానీ ఇటీవల కాలంలో చోరీల్లోనూ ఏదో తెలియని కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. గతేడాది బీహార్‌లో మూడు పాత బ్రిడ్రిలని విప్పుకుని చోరీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గ్యాస్ కట్టర్లతో బ్రిడ్జిలను కట్ చేసి దొంగిలించుకుని వెళ్లారు. ఇక ఇటీవల కాలంలో దొంగలు సెల్ ఫోన్ టవర్స్‌పై పడ్డారు.
చిన్నా చితకవి చోరీ చేస్తే లాభం లేదు.. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అని అనుకున్నారో ఏమో కానీ సెల్ ఫోన్ టవర్స్‌కే ఎసరు పెడుతున్నారు. తాజాగా ఇదే బీహార్ రాజధాని పాట్నాలోని సబ్జిబాగ్ ఏరియాలో ఉన్న ఓ సెల్ ఫోన్ టవర్‌ని చోరీ చేశారు. 2006 లో ఎయిర్ సెల్ మొబైల్ నెట్ వర్క్ కంపెనీ వాళ్లు ఓ ఇంటి రూఫ్‌పై సెల్ ఫోన్ టవర్‌ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాలంలో ఆ టవర్‌ని జిటిఎల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి విక్రయించారు. ఈ కంపెనీ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్‌కి తాము బిగించిన టవర్స్ నుంచి సిగ్నల్స్ అందించే సేవలు అందిస్తోంది. అయితే, తాజాగా జిటిఎల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది టవర్ ఇన్‌స్పెక్షన్ కోసం వచ్చి చూసి అక్కడ టవర్ కనిపించకపోవడంతో షాకయ్యారు. అప్పుడే తెలిసింది ఆ టవర్ చోరీ అయ్యిందని.
జిటిఎల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చెబుతున్న వివరాల ప్రకారం గతేడాది ఆగస్టు 31న టవర్ ఇన్‌స్పెక్షన్ చేయడం జరిగింది. తాజాగా టవర్ ఇన్‌స్పెక్షన్ కోసం వచ్చి చూసేసరికి టవర్ కనిపించడం లేదని కంపెనీ సిబ్బంది వాపోయారు. కంపెనీ ఏరియా మేనేజర్ మొహమ్మద్ షానవాజ్ అన్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ టవర్ చోరీ నేరం కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంటి యజమాని విచారణ చేయగా..
ఇదే విషయమై టవర్ ఏర్పాటు చేసి ఉన్న ఇంటి యజమానిని విచారణ చేయగా.. " నాలుగు నెలల క్రితం జిటిఎల్ కంపెనీ ఉద్యోగులం అని చెబుతూ కొంతమంది వచ్చి టవర్‌లో పెద్ద సాంకేతిక లోపం తలెత్తిందని.. దీనిని విప్పి ఇదే స్థానంలో కొత్త టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పి టవర్‌ని విప్పి ట్రక్కులో వేసుకుని వెళ్లిపోయారు " అని చెప్పారు. మొబైల్ టవర్ చోరీ జరిగి నాలుగు నెలలు గడవడంతో సీసీటీవీ దృశ్యాలు లభించే అవకాశం కూడా లేకుండాపోయింది. కేసు దర్యాప్తులో పోలీసులకు ఇదే అంశం పెద్ద సవాలుగా మారింది.