CI B Ravi got Suspended: హనుమకొండ : ఒక మహిళా సీఐ అధికారిణితో ఆమె ఇంట్లోనే ఏకాంతంగా పట్టుబడిన ఘటనలో మరో సీఐ బి రవిని క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్ చేస్తూ అడిషనల్ డీజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదారి పీఎస్ పరిధిలో ఓ మహిళా సీఐ ఇంట్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీ చేపట్టి పట్టుకున్న ఘటన కొద్దిరోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసు శాఖకే మచ్చ తెచ్చిన ఈ ఘటనలో సీఐ బి రవి తీరుపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమైంది.
మహిళా సీఐ భర్త సైతం మహబూబాబాద్ జిల్లాలో సీఐగా పనిచేస్తున్నారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకే సుబేదారి పోలీసులు ఉన్నతాధికారుల సహాయంతో రైడ్ చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తప్పు జరగకుండా అడ్డుకుని శాంతి భద్రతలకు కృషిచేయాల్సిన పోలీసులే ఇలా తప్పుదోవ పట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇక నేరాలను అదుపు చేసేదెవరు అనే ప్రశ్నలు తలెత్తేలా చేసింది ఈ ఘటన. మరోవైపు పోలీసుల వ్యవహార శైలిని సైతం అభాసుపాలయ్యేలా చేసింది.
పోలీసు శాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కునేలా చేసిన ఈ ఘటనలో సీఐ బి రవిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే పోలీసు శాఖపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి నేరాలను నిరోధించడం కష్టమేనని భావించిన అడిషినల్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ఈ కేసుపై విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్న అనంతరం తాజాగా సీఐ బి రవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇక సీఐడి విభాగంలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా సీఐ పరిస్థితి ఏంటని ప్రశ్నలు లేవనెత్తుతున్న వాళ్లు కూడా లేకపోలేదు.